Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 19

Viswamitra makes request !

With Sanskrit text in Telugu , Kannada , Devanagari

తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యం అద్భుతవిస్తరమ్ |
హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోsభ్యభాషత ||

తా|| ఆ రాజసింహునియొక్క అద్భుత మైన వాక్యములను విని పులకితగాత్రుడై మహాతేజోవంతుడగు విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

బాలకాండ
పందొమిదవ సర్గము
( విశ్వామిత్రుడు యజ్ఞసంరక్షణార్థమై శ్రీరాముని పంపమని అడుగుట)

విశ్వామిత్రుని ఆశ్వాసన ఇస్తూ చెప్పబడిన ఆ రాజసింహునియొక్క అద్భుత మైన వాక్యములను విని పులకితగాత్రుడై మహాతేజోవంతుడగు విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.

'ఓ ! రాజశార్దూలా ! నీవు మహావంశములో జన్మించినవాడవు, వశిష్ఠమహాముని ఉపదేశము పొందినవాడవు. కనుక నీవు ఇట్లు మాట్లాడుట యుక్తమే. నేను సంకల్పించిన కార్యమును చెప్పెదను. ఓ రాజశార్దూలా! దానిని ఆచరింపుము. నీవు ఆడినమాటకు బద్ధుడవు అగుము.'

'నేను ఒక లక్ష్య సిద్ధి కోసము నియమములను ఆచరిస్తున్నాను . వానిని కామరూపులగు ఇద్దరు రాక్షసులు విఘ్నములు కలిగిస్తున్నారు. నా వ్రతము సంపూర్ణమగుచుండగా సుశిక్షుతులు పరాక్రమవంతులు అగు మారీచుడు సుబాహుడు అను రాక్షసులు ఇద్దరూ మాంసఖండములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు. ఈ విధముగా నియమనిష్ఠలతో ఆచరింపబడుచున్న యజ్ఞము విఫలమగుచున్నది. శ్రమయంతయూ వృథాఅగుచున్నది. ఉత్సాహము కోలుపోయి అచటినుండి ఇచటికి వచ్చినాను. ఓ పార్థివా! వారు విఘ్నములు కలిగించుచున్ననూ వారి పై క్రోథము ప్రకటించుట గాని శాపమిచ్చుటగాని యజ్ఞదీక్షలో నున్న నాకు తగదు కదా !'

' ఓ రాజశార్దూల ! జ్యేష్ఠుడు సత్యపరాక్రమము గలవాడు , కాకపక్షధరుడు , శూరుడు అయిన నీ జ్యేష్ఠ పుత్త్రుని నాకు సహాయముగా ఇమ్ము. అతడు నా అధ్వర్యములో తన దివ్యమైన తేజో ప్రభావముతో దుష్ఠకర్మలను ఆచరించు ఆ రాక్షసులని నాశనము చేయగలడు. అతనికి అనేకవిధములుగా శ్రేయస్సు కలుగుటకు నేను వరములిచ్చెదను. అందుకు సందేహములేదు'.

'దీనివలన ముల్లోకములలో ఈయన ఖ్యాతి పొందును. ఆ మునిని ఎదుర్కొని ఆ రాక్షసులు నిలువజాలరు. శ్రీరాముడు తప్ప వేరు ఎవరూ ఆ రాక్షసులను చంపజాలరు. ఆ రాక్షసులు బలగర్వముతో అనేక పాపకృత్యములను చేసియున్నారు. వారు కాలపాశముయొక్క వశములో నున్నారు'.

'ఓ రాజా ! పుత్త్రవాత్సల్యముచే రాముని శక్తి సామర్థ్యములను తక్కువగా గణింపవద్దు. నేను ప్రతిజ్ఞా పూర్వకముగా చెప్పుచున్నాను. సత్యపరాక్రముగల శ్రీరాముడు తప్పక ఆ రాక్షసులని వధించగలడు. ఈ విషయము నేను ఎఱుంగుదును. మీ పురోహితుడు మహాతేజశ్వి అయిన వశిష్ఠుడు ఎఱుంగును. అదే విధముగా ఇక్కడనున్న తాపసికులు గూడా ఎఱుంగుదురు. ఓ రాజేంద్ర ! ధర్మమును , స్థిరమైన కీర్థి ప్రతిష్ఠలను కోరుకున్నచో శ్రీరాముని నావెంట పంపుము. ఓ రాజా ! నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మున్నగు మునీశ్వరులు అంగీకిరించిన పిమ్మటనే శ్రీరాముని నావెంట పంపుము'.

'రాజీవ లోచనుడైన నీ పుత్త్రుని పది దినములపాటు యాగ రక్షణార్థమై పంపుము. ఇది నాఅభీష్టము. ఓ రాఘవా ! ఏ మాత్రము విలంబన లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తియగు నటుల చూడుము. నీకు శుభమగుగాక. మనస్సులో శోకము లేకుండుగాక'.

ఈ విధముగా ఆ ధర్మాత్ముడు ధర్మము అర్థము తో గూడియున్న ఆ వచనములను పలికి మిన్నకుండెను. ఆ బ్రహ్మర్షి వచనములను విని ఆ రాజు తీవ్రమైన శోకమునకు గురి అయి భయముతో క్రుంగిపోయెను.

విశ్వామిత్రుని వచనములు ఆ రాజుయొక్క హృదయమును మనస్సును మిక్కిలి కలచి వేసెను. అప్పుడతడు మిక్కిలి మనస్తాపమునకు గురి అయి తన ఆసనమునందే భయపడిన మనస్సుతో మిక్కిలి చలించిపోయెను.

|| ఈ విధముగా బాలకాండలోని పంతొమ్మిదవ సర్గ సమాప్తం ||
!! ఓమ్ తత్ సత్!!

ఇతి హృదయమనోవిదారణం
మునివచనం తదతీవ శుశ్రువాన్|
నరపతిరభవన్మహాన్ మహాత్మా
వ్యధితమనాః ప్రచచాల చాసనాత్ ||

తా|| విశ్వామిత్రుని వచనములు ఆ రాజుయొక్క హృదయమును మనస్సును మిక్కిలి కలచి వేసెను. అప్పుడతడు మిక్కిలి మనస్తాపమునకు గురి అయి తన ఆసనమునందే భయపడిన మనస్సుతో మిక్కిలి చలించిపోయెను.

||ఒమ్ తత్ సత్ ||


|| om tat sat ||